Telangana: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం

Telangana

Telangana

(Telangana) తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకుని చాలా రోజులు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. సాధారణంగా ఈ కాలంలో మంచి వర్షపాతం నమోదవుతుండగా, ఈసారి లోటు వర్షపాతం పరిస్థితులు నెలకొన్నాయి.

(Telangana) రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామాల్లో 11,479 గ్రామాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. అంటే దాదాపు 92 శాతం గ్రామాలు ఎల్‌నినో ప్రభావ పరిధిలోకి వచ్చినట్లు అంచనా. వీటిలో 892 గ్రామాలు అత్యంత తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటుండగా, 7,939 గ్రామాల్లో తీవ్రమైన స్థాయిలో, 2,998 గ్రామాల్లో మోస్తరు స్థాయిలో ప్రభావం నమోదైంది.

ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో 1.32 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు 59.83 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. ఇది మొత్తం లక్ష్యంలో 45.20 శాతం మాత్రమే. ఇంకా 72.54 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభం కాలేదు. వీటిలో అధిక భాగం వర్షాధార భూములు కావడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.

వర్షాలు మరింత ఆలస్యమైతే విత్తనాలు ఆలస్యంగా వేయాల్సి రావడం, మొలకలు సరిగా రాకపోవడం, తిరిగి విత్తాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్, వేరుసెనగ వంటి ప్రధాన పంటల సాగు విస్తీర్ణం తగ్గే ప్రమాదం ఉందని నివేదిక తెలిపింది.

వర్షాభావం కొనసాగితే చెరువులు, కుంటలు, వాగులు త్వరగా ఎండిపోవడం, భూగర్భ జలమట్టం పడిపోవడం వల్ల తాగునీరు, సాగునీటి కొరత ఏర్పడే అవకాశముంది. పశువులకు పచ్చిమేత కొరత ఏర్పడి పాల ఉత్పత్తి తగ్గే ప్రమాదం కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు.

రైతులు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తక్కువ కాలంలో పండే, కరవును తట్టుకునే పంటలను ఎంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే వర్షపు నీటి సంరక్షణ, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా అమలు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది.