Vikram-1: చరిత్ర సృష్టించిన ‘విక్రమ్-1’

Vikram-1

Vikram-1

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల కొత్త యుగానికి నాంది పలుకుతూ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ (Vikram-1) ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొదట ఈ ప్రయోగాన్ని ఉదయం 11:30 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కౌంట్‌డౌన్ చివరి దశలో గుర్తించిన చిన్న సాంకేతిక లోపాన్ని ఇస్రో, స్కైరూట్ శాస్త్రవేత్తలు వేగంగా సరిచేసి కేవలం 35 నిమిషాల ఆలస్యంతో ప్రయోగాన్ని పూర్తి చేశారు.

‘మిషన్ ఆగమన్’ పేరుతో నిర్వహించిన ఈ ప్రయోగం ద్వారా భారతదేశంలో ప్రైవేట్ స్టార్టప్ సంస్థ స్వంత రాకెట్ ద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన తొలి కంపెనీగా స్కైరూట్ చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ప్రైవేట్ సంస్థలు విడిభాగాల తయారీకే పరిమితమై ఉండగా, ఇప్పుడు పూర్తి స్థాయి రాకెట్ అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

విక్రమ్-1 (Vikram-1) రాకెట్‌లో అధునాతన ఆల్ కార్బన్ కంపోజిట్ నిర్మాణాన్ని ఉపయోగించారు. ఇది ఉక్కు కంటే తక్కువ బరువుతో ఎక్కువ బలాన్ని కలిగి ఉండటం విశేషం. అలాగే 100 శాతం త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో తయారైన లిక్విడ్ ఇంజిన్‌ను ఇందులో అమర్చారు. భవిష్యత్తులో అంతరిక్ష చెత్త నిర్వహణకు ఉపయోగపడే ‘ఎంబ్రేస్’ అనే రోబోటిక్ హ్యాండ్ పరికరాన్ని కూడా పరీక్షాత్మకంగా పంపారు. సైన్స్, కళల సమ్మేళనంగా ‘కాస్మిక్ బ్లూమ్’ అనే ల్యాబ్‌లో పెంచిన డైమండ్‌ను ప్రత్యేక పేలోడ్‌గా అంతరిక్షంలోకి పంపించడం ఈ ప్రయోగానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భారత అంతరిక్ష రంగానికి సేవలందించిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సీవీ రామన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంలకు నివాళిగా వారి మైక్రో శిల్పాలతో రూపొందించిన చిన్న బంగారు రాకెట్‌ను కూడా పంపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వహస్తాలతో రాసిన “వందేమాతరం” సందేశంతో కూడిన ప్రత్యేక పోస్ట్‌కార్డు కూడా ఈ ప్రయోగంలో భాగమైంది. చిన్న అంతరాయాన్ని అధిగమించి సాధించిన ఈ విజయం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురానుందని భావిస్తున్నారు.

Also read: