దేశ రాజధాని ఢిల్లీలోని (Jantar Manta) జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వివిధ విద్యార్థి సంఘాలు మరియు వామపక్ష సంస్థలు ఆందోళనను ముమ్మరం చేశాయి. సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించడంతో నిరసనకారుల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
వాంగ్‌చుక్ తరలింపుతో ఆందోళన ముగిసిపోదని ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ డిప్కే, అదే వేదికపై తాను ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. వాంగ్‌చుక్‌ను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ, శాంతియుత నిరసనకారులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారని ఆరోపించారు.
పోలీసులు తమను రోడ్లపై ఈడ్చుకెళ్లారని, కనీస మానవత్వం చూపలేదని డిప్కే విమర్శించారు. తమకు మద్దతుగా వస్తున్న లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులను కూడా చెక్‌పోస్టుల వద్దే అడ్డుకున్నారని అన్నారు. వాంగ్‌చుక్‌ను తరలించినంత మాత్రాన ఉద్యమం ఆగదని, ఈ నెల 20న పార్లమెంట్ వైపు భారీ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
అభిజిత్ డిప్కేకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ తదితర విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తమ నాయకత్వంలో కూడా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని వెల్లడించాయి. వివిధ విద్యార్థి సంఘాల నేతలు జంతర్ మంతర్‌కు చేరుకుని నిరసనలకు మద్దతు తెలుపుతున్నారు.
ఈ పరిణామాలతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేస్తూ అదనపు బలగాలను మోహరించారు. రాబోయే పార్లమెంట్ మార్చ్ నేపథ్యంలో పరిస్థితి మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. (Jantar Manta) జంతర్ మంతర్‌లో మొదలైన ఈ ఆందోళన ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ చర్చకు దారితీస్తోంది.
Also read:
