EshaSingh: చైనా గడ్డపై తెలుగమ్మాయి సత్తా!

EshaSingh

EshaSingh

చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ISSF షూటింగ్ వరల్డ్ కప్ 2026లో భారత మహిళా షూటర్లు మరోసారి అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన యువ షూటర్ (EshaSingh) ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, స్టార్ షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించింది. దీంతో అంతర్జాతీయ షూటింగ్ వేదికపై భారత ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది.

ఫైనల్‌లో (EshaSingh) ఈషా సింగ్ అసాధారణ ఏకాగ్రతతో పోటీని పూర్తి చేసింది. మొత్తం 40 హిట్స్ నమోదు చేసి ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆతిథ్య దేశం చైనాకు చెందిన ఝాంగ్ యుయు 37 పాయింట్లతో రెండో స్థానంలో నిలవడంతో ఈషా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఆమె సాధించిన రెండో వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ ఇదే కావడం విశేషం. అంతకుముందు మ్యూనిచ్‌లో జరిగిన టోర్నీలో కూడా ఈషా అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

పోటీ అనంతరం మాట్లాడిన ఈషా సింగ్, గత విజయాల కారణంగా తనపై అంచనాలు పెరిగాయని, ఆ ఒత్తిడిని అధిగమించి మరోసారి విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. హాంగ్జౌ వేదిక తనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని, గత ఆసియా క్రీడల్లో కూడా ఇక్కడే మంచి విజయాలు అందుకున్నానని గుర్తు చేసుకుంది.

మరోవైపు డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ కూడా తన అనుభవాన్ని చాటుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో కీలకమైన షూట్-ఆఫ్‌లో 28 హిట్స్ నమోదు చేసి ఉత్తర కొరియా షూటర్ పాక్ హ్యోన్ గ్యోంగ్‌పై ఆధిక్యం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ విజయం భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ టోర్నీలకు తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని మను పేర్కొంది.

క్వాలిఫికేషన్ దశలో కూడా భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మను భాకర్ 586 పాయింట్లతో తొలి స్థానం సాధించగా, ఈషా సింగ్ 585 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయాలతో భారత పతకాల సంఖ్య మరింత పెరిగి ప్రపంచ షూటింగ్ వేదికపై భారత మహిళా షూటర్ల ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది.

Also read: