కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై గతంలో విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయడానికి తెలంగాణ (HighCourt) హైకోర్టు నిరాకరించింది. ఈ పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిధుల వినియోగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్న బడ్జెట్‌పై స్పష్టత అవసరమని పేర్కొంది.

ఆగస్టు 19న ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన (HighCourt) హైకోర్టు, అందులో అవసరమైన పూర్తి వివరాలు లేవని అభిప్రాయపడింది. పథకాలకు నిధులు కేటాయించడం వల్ల ఉద్యోగుల పదవీవిరమణ అనంతరం అందాల్సిన పెన్షన్లు, ఇతర ప్రయోజనాల చెల్లింపులపై ప్రభావం పడుతోందా అనే అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. ప్రజల పన్నుల ద్వారా సమకూరే నిధులను ఉచిత పథకాలకు వినియోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.
ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో పూర్తి సమాచారం లేదని పేర్కొన్న ధర్మాసనం, అన్ని వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులో జాప్యంపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ పథకాల చట్టబద్ధత, బడ్జెట్ కేటాయింపులు, నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆగస్టు 13న హైకోర్టు ఈ పథకాల అమలుపై మధ్యంతర స్టే విధించింది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. అర్హత కలిగిన వధువులకు రూ.1,00,116 ఆర్థిక సహాయం అందించేలా పథకాన్ని రూపొందించారు.
Also read:
