టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ చిత్రానికి నాంది పలికింది. దగ్గుబాటి వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం (VenkyAnil5) #VenkyAnil5 మరియు #NKRAR2 వర్కింగ్ టైటిల్స్‌తో గుర్తింపు పొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జూన్ 18న హైదరాబాద్‌లో నిర్వహించబడ్డాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలి సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలని ఆకాంక్షించారు. రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దిల్ రాజు స్క్రిప్ట్‌ను అందించి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

(VenkyAnil5) ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నట్లు అధికారికంగా స్పష్టత వచ్చింది. పూజా కార్యక్రమంలో హీరోయిన్లు కూడా పాల్గొనడం విశేషంగా నిలిచింది. తొలి షాట్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లు తమ తమ జోడీలను మార్చుకున్నట్లుగా చిత్రీకరించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తుండగా, పాటలను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇప్పటికే పలుమార్లు విజయవంతమైంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘పటాస్’ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. 2027 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also read:
