తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన సంప్రదాయ వంటకం (Mutton)‘బొక్కల చారు’ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారంగా గుర్తింపు పొందుతోంది. మటన్ బోన్స్‌తో తయారయ్యే ఈ ప్రత్యేక సూప్‌లో కొలాజన్, జెలటిన్, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఎముకల బలం పెరగడంలో, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు, వయసుతో వచ్చే చర్మ ముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు దీన్ని ఆహారంలో చేర్చుకుంటున్నారు.

బొక్కల చారు తయారీలో మటన్ (Mutton) పక్కటెముకల భాగం ఉపయోగిస్తే రుచి మరింత మెరుగ్గా వస్తుందని చెబుతారు. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు వంటి మసాలాలను వేయించి పొడి చేసి ఉపయోగించడం వల్ల సూప్‌కు ప్రత్యేకమైన వాసన, రుచి వస్తాయి. అలాగే ఎండు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పుతో తయారుచేసిన పేస్ట్ చారుకు చిక్కదనాన్ని ఇస్తుంది.
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనాను నూనెలో వేయించి, అందులో మటన్ బోన్స్ వేసి బాగా వేగించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, కారం, కొబ్బరి-గసగసాల పేస్ట్ కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. అవసరమైనంత వేడి నీరు పోసి ప్రత్యేక మసాలా పొడి జతచేసి కుక్కర్‌లో కొన్ని విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే బొక్కల చారు సిద్ధమవుతుంది.

ఈ సూప్ వేడిగా ఉన్నప్పుడు పల్చగా కనిపించినా, చల్లారిన తర్వాత కొలాజన్ కారణంగా చిక్కగా మారుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల సమయంలో దీన్ని సూప్‌లా తాగితే ఉపశమనం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు.
బొక్కల చారును అన్నం, రాగి ముద్ద, జొన్న రొట్టెలు, చపాతీ లేదా పూరీలతో తీసుకుంటే రుచిగా ఉంటుంది. సంప్రదాయ రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ తెలంగాణ ప్రత్యేక వంటకం ప్రస్తుతం అనేక కుటుంబాల్లో మళ్లీ ప్రాధాన్యం పొందుతోంది.
Also read:
