బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ (Kangana) కంగనా రనౌత్, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. యువతపై కంగనా చేసిన వ్యాఖ్యలను రాందేవ్ తప్పుబట్టగా.. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించవద్దంటూ కంగనా ఘాటుగా స్పందించారు. ఈ వివాదంలో ఇద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యువత నిర్వహించిన నిరసనలపై (Kangana) కంగనా గతంలో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఆందోళన జరిగిన ప్రాంతాల్లో చెత్త, అసహ్యకర పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించడంతో పాటు, యువతను ఉద్దేశించి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నిరసనల సందర్భంగా పోలీసులు తమను రక్షించారని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అంతేకాకుండా యువతను ఉద్దేశించి ‘గట్టర్ జనరేషన్’ అనే పదాన్ని ఉపయోగించడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
కంగనా వ్యాఖ్యలపై నిరసనలకు సంబంధించిన ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్రంగా స్పందించారు. యువత మొత్తాన్ని ఒకే విధంగా చూడటం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక కంగనా ఆలోచనా విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని విమర్శించారు. కంగనా తన వ్యాఖ్యల ద్వారా రాజకీయంగా, ప్రజల్లో ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.
దీనికి కంగనా కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. సౌరవ్ దాస్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించారు. అయితే తన వ్యాఖ్యలను పూర్తిగా జెన్‌జీ తరానికి వ్యతిరేకంగా చేసినవిగా చూడవద్దని, కొందరి ప్రవర్తనను మాత్రమే తాను తప్పుబట్టానని తరువాత వివరణ ఇచ్చారు.
ఇదే సమయంలో ఈ వివాదంలోకి బాబా రాందేవ్ ప్రవేశించారు. దేశ యువతను అవమానించేలా మాట్లాడే హక్కు కంగనాకు ఏముందని ఆయన ప్రశ్నించారు. ఆమె బాల్యం, యవ్వనం, గత జీవితం, విజయాలను ప్రస్తావిస్తూ యువతను ‘గట్టర్ జనరేషన్’గా అభివర్ణించడం సరైనది కాదని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తాయని రాందేవ్ విమర్శించారు.
రాందేవ్ వ్యాఖ్యలకు కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తన యవ్వనం, వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా బెడ్‌రూమ్ గురించి ఊహాగానాలు చేయవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుకార్లు, వదంతుల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని పేర్కొన్నారు.
అంతేకాకుండా పతంజలి ఉత్పత్తుల ప్రకటనల వ్యవహారంలో సుప్రీంకోర్టు గతంలో రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలను కూడా కంగనా ప్రస్తావించారు. ఆ కేసులో కోర్టు ముందు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. తన క్యారెక్టర్‌పై మాట్లాడే ముందు గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలని పరోక్షంగా సూచించారు.
ఈ విధంగా కంగనా, బాబా రాందేవ్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తులో ఈ వివాదంపై రాందేవ్ మరోసారి స్పందిస్తారా? లేక ఇక్కడితో ఈ వ్యవహారం ముగుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also read:
