CyberCrime: రూ.22 పార్శిల్ మెసేజ్ వచ్చిందా?

CyberCrime

CyberCrime

దేశవ్యాప్తంగా (CyberCrime) సైబర్ నేరగాళ్లు కొత్త తరహా ఫిషింగ్ మోసాలతో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా పార్శిల్ డెలివరీ పేరుతో పంపుతున్న నకిలీ ఎస్‌ఎంఎస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. “మీ పార్శిల్‌కు చిరునామా తప్పుగా ఉంది.. రూ.22 చెల్లించి రీషెడ్యూల్ చేసుకోండి” అనే సందేశాలను ఇండియా పోస్ట్ పేరుతో పంపిస్తూ సైబర్ కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు.

ఈ సందేశంలో అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ లింక్‌ను జతచేస్తున్నారు. చాలా మంది అది నిజమని నమ్మి లింక్‌పై క్లిక్ చేసి రూ.22 చెల్లించే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ ప్రక్రియలో బ్యాంకింగ్ వివరాలు, కార్డు సమాచారం లేదా ఓటీపీ వంటి కీలక వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉంది. ఫలితంగా బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు మాయమయ్యే అవకాశం ఉంటుంది.

ఇటీవల హైదరాబాద్‌లో ఇలాంటి మోసాలకు పలువురు బాధితులైనట్లు సమాచారం. ఒక కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి రూ.23.26 లక్షలు, మరో వ్యక్తి రూ.2.49 లక్షలు కోల్పోయిన ఘటనలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ భద్రతా నిపుణులు ప్రజలు అనుమానాస్పద సందేశాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

అధికారుల ప్రకారం, ఇండియా పోస్ట్ ఎప్పుడూ ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం లేదా ఓటీపీలను అడగదు. పార్శిల్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక సేవల ద్వారానే ధృవీకరించాలి. తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, చిన్న మొత్తాల చెల్లింపుల పేరుతో వివరాలు నమోదు చేయడం ప్రమాదకరం.

ఒకవేళ (CyberCrime) సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. డబ్బు బదిలీ అయిన వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా నిధులు నిలిపివేసే అవకాశం ఉంటుంది. వేగంగా స్పందిస్తే నష్టాన్ని తగ్గించుకునే అవకాశాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.