NarendraModi: డ్రగ్స్ రహితంగా మార్చే లక్ష్యం

NarendraModi

NarendraModi

దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని (NarendraModi) నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ లక్ష్యంతో ‘వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ – నషా ముక్త్ యువా’ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ఇది ప్రజలందరి భాగస్వామ్యంతో ముందుకు సాగాల్సిన ఉద్యమమని ప్రధాని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని (NarendraModi) మోదీ, మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తి లేదా కుటుంబానికే పరిమితమైన సమస్య కాదని, అది సమాజం, దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశమని అన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండే జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.

ఏ సమస్యనైనా ఒంటరిగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తే సవాళ్లు ఎదురవుతాయని, కానీ ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంగా చేపడితే గొప్ప ఫలితాలు సాధించవచ్చని ప్రధాని వివరించారు. గత ఏడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా 125కి పైగా ఆధ్యాత్మిక సంస్థలు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. ఈ భాగస్వామ్యం యువతలో సానుకూల మార్పుకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ జాతీయ ప్రచారంలో భాగంగా 100 వారాల పాటు ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వాకథాన్‌లు, క్రీడా పోటీలు, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీధి నాటకాలు, కళా పోటీలు, రౌండ్ టేబుల్ చర్చలు వంటి కార్యక్రమాల ద్వారా యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. 10 వేలకుపైగా ప్రాంతాల్లో యువత ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొని తమ మద్దతు ప్రకటించింది. మై భారత్ వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ సభ్యులు, యూత్ క్లబ్బులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం విశేషంగా నిలిచింది.

Also read: