గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో (India) భారత క్రీడాకారులు మరోసారి అద్భుత ప్రదర్శనతో మెరిశారు. ముఖ్యంగా బాక్సింగ్, పారా అథ్లెటిక్స్, ట్రిపుల్ జంప్ విభాగాల్లో భారత అథ్లెట్లు పతకాల వర్షం కురిపిస్తూ దేశానికి గర్వకారణంగా నిలిచారు. శనివారం జరిగిన పోటీల్లో భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు చేరగా, రజత, కాంస్య పతకాలతో కూడిన విజయాలను కూడా నమోదు చేసింది.
మహిళల 54 కేజీల బాక్సింగ్ విభాగంలో ప్రీతి పవార్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోపై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్ మొత్తం ప్రీతి పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో ఐదుగురు న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా ఆమెకు విజయం ప్రకటించారు.
మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియా కూడా అద్భుత పోరాటంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేలా వాల్ష్‌ను 5-0 తేడాతో ఓడించి భారత ఖాతాలో మరో గోల్డ్ మెడల్ జత చేసింది. జైస్మిన్ దూకుడు ముందు ప్రత్యర్థి నిలవలేకపోయింది.
పురుషుల 55 కేజీల బాక్సింగ్ విభాగంలో (India) భారత బాక్సర్ జాదుమణి ఫైనల్ వరకు చేరి రజత పతకాన్ని సాధించాడు. అయితే తుది పోరులో ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్ చేతిలో ఓటమి చెందాడు.
పారా అథ్లెటిక్స్‌లో కూడా భారత ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. ఎఫ్-57 షాట్‌పుట్ ఈవెంట్‌లో సోమన్ రాణా 13.40 మీటర్ల దూరం గుండును విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అదే ఈవెంట్‌లో శుభమ్ జ్యువెల్ 13.28 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఇది మూడో స్వర్ణ పతకం కావడం విశేషం.
ఇక పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్ల జంప్‌తో రజత పతకం గెలవగా, సెల్వ ప్రభు తిరుమరన్ 16.52 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. భారత క్రీడాకారుల ఈ వరుస విజయాలతో కామన్వెల్త్ గేమ్స్‌లో దేశ పతకాల సంఖ్య మరింత పెరిగింది.
Also read:
- Anantapur: సహజీవనం చేస్తున్న వ్యక్తిపై మహిళ తీవ్ర దాడి
- APCPDCL: ఏపీలో కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలా?
